మన తెలుగు వారికి ఈ be verb ఒక సింహ స్వప్నం అంటే అతిశయోక్తి కాదు. దానికి కారణాలు కూడా ఉన్నాయి సుమా! కాబట్టి దీని మీద సంపూర్ణమైన పట్టులేనిదే ఆంగ్ల భాష మీద పట్టు సాధించలేరు. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలను.
మా ఇంటి దగ్గరలో ఒక మేనేజ్డ్ సర్వీస్ ఫ్లాట్లు ఉన్నాయి. దాని చూసుకోవడానికి ఒక రిసెప్షనిస్ట్. నేను ఒక ఆదివారం రోజు మార్నింగ్ వాకింగ్ కి వెడుతూండగా ఆ రిసెప్షనిస్ట్ తారసపడ్డాడు. పరిచయాలు జరిగాయి. నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆ రిసెప్షనిస్ట్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పుచ్చుకుని ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అది విని చాలా ఆశ్చర్యం వేసింది. వారి కస్టమర్లు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ ఈ ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఇతనికి ఆంగ్లం సరిగ్గా వచ్చి ఉండదు అని అంచనా వేశాను. అదే నిజం అని తేలింది. అది నేను ఎలా తెలుసుకున్నాను అంటే be verb సహాయంతోనే.
నేను అతనితో ఇలా అన్నాను "నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను. దీని జవాబు చాలా సులువు. దీనికి కనుక నీవు జవాబు చెబితే సంఘం నీకు సరైన ఉద్యోగం ఇవ్వడంలో అన్యాయం చేసినట్టు. లేకపోతే నీకు నీవు అన్యాయం చేసుకున్నట్టు? ఏమంటావు" అతను ఈ మాటలు వినగానే ఎక్కుడలేని ఉత్సాహంతో నేను రెడీ అన్నాడు.
అప్పుడు నేను అతనిని ఇలా అడిగాను రెండు భాషల్లో:
తెలుగు: మీరు ఎవరు?
ఇంగ్లీష్: what are you?
అతని సమాధానాలు:
తెలుగు: నేను ఇంజనీరు.
ఇంగ్లీష్: I am an engineer.
బాగా చెప్పావు. మరి తెలుగు సమాధానం లోను ఇంగ్లీష్ సమాధానం లోను క్రియ ఏంటి? అని అడిగాను.
అతను తెలుగులో ఇంజనీరు మరియు ఇంగ్లీష్ లో am అని తన మిడి జ్ఞానంతో చెప్పాడు.
అప్పుడు నేను అన్నాను క్రియ ఏ భాషలో నైనా ఒకటే కదా అన్నాను. నా తర్కానికి తట్టుకోలేక ఇంగ్లీష్ లో క్రియ కూడా ఇంజనీరు అని చెప్పాడు.
దీని తరువాత నా నుంచి నా అభిప్రాయం తెలుసుకోవాలి అని ఉత్సుకతతో ఎదురుచూడసాగాడు. అప్పుడు నేను బరువెక్కిన హృదయంతో "నీకు నీవే అన్యాయం చేసుకున్నావు" అని చెప్పాను. నీవు ఇంగ్లీషు మీద ధ్యాస పెట్టి చదివితే నీకు ఆ భాష మీద పట్టు వస్తుంది అని తెలిపాను.
అతను తన సమాధానం అలా చెప్పడానికి ఈ క్రింది కారణాలు ఆపాదించవచ్చును.
1. తెలుగులో కొన్ని వాక్యాలు క్రియలు లేకుండా రాయవచ్చును కానీ, ఇంగ్లీషులో అది సాధ్యం కాదు. ఇంగ్లీష్ verb మూలమైన fixed order భాష
2. తెలుగు క్రియలకు మరియు ఇంగ్లీష్ క్రియలు తయారు చేయి పద్దతి వేరు వేరు. తెలుగు క్రియ subject, number, gender, tense బట్టి మారుతుంది. కాబట్టి మనం భాషలో ఒక క్రియకు రూపాలు వేరు వేరు మరియు ఎక్కువ. ఇంగ్లీష్ భాషలో verb forms తక్కువ. వాటిని వివిధ అవసరాలకు వాడేటప్పుడు వారు helping verbs సహాయం తీసుకుంటారు. కాబట్టి ఇంగ్లీషు లో ఇటు వంటి సందర్భాలలో క్రియ మరియు దానికి సంబంధించిన పదాల సమూహాన్ని verb phrase అంటారు.
ఈ పై పెర్కొన్న కారణాల వలన తెలుగు మాతృభాష మాట్లాడే వారు ఈ తప్పులు చేయడం పరిపాటి. మరి ఈ తప్పులు దొర్లకుండా ఉండాలి అంటే ఇంగ్లీష్ మన తెలుగు భాష దృక్కోణం నుంచి తరిచిచూసి నేర్చుకోవడమే. సులువు కదా!
Comments
Post a Comment