నేను మా పిల్లలందరికీ ఒక విషయం పదే పదే చెప్తుంటాను. చదువుకు సంబంధించిన ఏ విషయం అయినా మనం మన జీవితానికి అన్వయించుకోవాలి అని.
అయితే మా చిన్న వాడు తెలుగు చదవడం నేర్చుకుంటున్నప్పుడు మరి ఈ సంక్లిష్ట అక్షరాలను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి ప్రశ్నించాడు? నేను వాడికి ఇలా చెప్పాను.
మనం ఒక ఫ్లాట్ లో నివసిస్తున్నాము. (యాదృచ్ఛికంగా అది రెండో ఫ్లోర్ లోనే ఉంది). వాడు చిన్న వాడు కాబట్టి కొంచెం విపులంగా చెప్పవలసిన అవసరం ఉంది. నేల , దాని మీద గ్రౌండ్ ఫ్లోర్, దాని మీద మొదటి ఫ్లోర్ దాని మీద సెకండ్ ఫ్లోర్ ఉంటుంది కదా అంటే వాడు తలాడించాడు. దీని నుండే సంక్లిష్ట అక్షరం వచ్చింది. అలా అనగానే వాడు ఆశ్చర్యపోయాడు. మనం ఒక ఉదాహరణ తీసుకుని చూద్దాం.
ఎప్పుడైనా: ప్రాణం అచ్చులు(vowels), ప్రాణులు: హల్లులే(consonants).
స్త్రీలు: ఈ పదంలో మొట్టమొదటి అక్షరం సంశ్లేషాక్షరం ఎందుకంటే దీనిలో ఒక హల్లుకు రెండు హల్లుల వత్తులు వచ్చాయి. అంతేకాక గుణింతం కూడా ఉంది. మరి దీనిని ఎలా చదవాలి అనేదే పెద్ద సమస్య.
మనం మన ఫ్లాటు మోడల్ తీసుకుందాం. తెలుగు పై అంతస్తు నుంచి నేల మీదికి వెళ్ళాలి. మనం నేలకి గుణింతం ఆపాదించుదాం. హల్లులన్ని నకారపు పొల్లులాగా రాసుకుందాం.
స్ --> రెండవ అంతస్తు
+ (Floor / roof)
త్ --> మొదటి అంతస్తు
+ (Floor / roof)
ర్ --> గ్రౌండ్ అంతస్తు
+ (Floor)
ీ --> భూమి లేక నేల
పైన ఇచ్చిన నమూనాను, అదే రెండవ అంతస్తు నుండి నేల వరకు ఉన్న దానిని మనం ఎడమ నుండి కుడికి ఈ క్రింది విధంగా రాసుకొన వచ్చును. మనం ప్రతి అంతస్తు floor/roof) ను + ( plus) గుర్తుగా రాసుకోవాలి.
స్+త్+ర్+ీ
మరి తెలుగు మాట రాసినప్పుడు గుణింతం పై అక్షరానికి చూపించిన అది పలికేప్పుడు చిట్టచివరి హల్లుకు వర్తిస్తుంది.
స్+త్+రీ ( ర్+ ఈ -- రీ గుణింతాల ప్రకారం అయింది)
సూచన: ్ అంటే నకారపు పొల్లు. అది ఏ హల్లుకు ఉంటే ఆ అక్షరాన్ని సగమే పలకాలి.
ఇప్పుడు మనకు మూడు syllables ఉన్నాయి.
వీటిని ముందుగా విడిగా పలికిన, కాస్త beat పెంచి వీటిని గబగబా చదివితే ఆ సంశ్లేషాక్షర ఉచ్చారణ వచ్చేస్తుంది.
ఈ ప్రక్రియ తెలుగు మాటలో ఉండే ప్రతి అక్షరానికి వర్తింప జేస్తే ఆ తెలుగు పదం యొక్క ఉచ్చారణ వస్తుంది. అంటే ఇక తెలుగు పదం చదివినట్లే.
సంశ్లేషాక్షర పదాలు చదవగలిగితే అంతా చదవడం వచ్చినట్లే.
Comments
Post a Comment