ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం తెలుగు భాష దోషములు లేకుండా చదవడానికి కానీ రాయడానికి కానీ జనాలు చాలా కష్టపడుతున్నారు. ఈ కష్టాన్ని రూపుమాపేందుకు ఈ వ్యాసం ఒక ఉడుతాభక్తిగా రాయబడింది.
మన తెలుగు భాషలో పదాలు ఐదు రకాలు. ఈ విభజన పదాల చదవటానికి కానీ రాయటానికి కానీ ఎంత క్లిష్ట తరంగా ఉన్నాయో దాని ఆధారంగా చేసుకుని ఈ క్రింది విధంగా చేయబడినవి.
పదాల రకాలు (క్లిష్టత ఆధారంగా):-
సరళ పదాలు
గుణింతక్షర పదాలు
దిత్వాక్షర పదాలు
సంయుక్తాక్షర పదాలు
సంశ్లేషాక్షర పదాలు
సరళ పదాలు:
ఈ పదాలు వాటి విభజన పేరుకు తగ్గట్టుగానే రాయడానికి కానీ చదవటానికి కానీ చాలా సులువు. ఎందుకంటే, ఈ పదాల్లో ఎటువంటి గుణింతాలు కానీ వత్తులు కానీ ఉండవు.
ఉదాహరణ: సరళ, వడ, ఈగ మొదలగునవి.
చదువుట: వీటిని చదువుట చాలా సులువు. మనకు అక్షరమాల తెలిస్తే సరిపోతుంది. అక్షరమాల ప్రకారం పదం లో ఉన్న ప్రతి అక్షరం ఉచ్చరిస్తూ అన్ని అక్షరాలు త్వర త్వరగా చదివితే మనకు పదం యొక్క ఉచ్చారణ వస్తుంది.
రాయడం: మనం ఏ పదాన్ని రాయాలి అనుకుంటున్నామో దానిని సరిగ్గా మరియు మెల్లగా ఉచ్చరిస్తే, మనకు ఆ పదంలోని అక్షరాలు స్పష్టంగా గోచరిస్తాయి. అంతే ఆ అక్షరాల కూర్పే ఆ పదం.
కొన్ని సార్లు పదం యొక్క యాసతో ఒక పదం యొక్క అక్షరాల కూర్పు మారుతుంది. ఇది తప్పుకాదు.
గుణింతక్షర పదాలు:
ఈ పదాలు వాటి విభజన పేరుకు తగ్గట్టుగానే గుణింతాలు కొన్ని అక్షరాలకు మాత్రమే కలిగి ఉంటాయి.
ఉదాహరణ: కోతి, గోదావరి, కృషి, దేవుడు మొదలగునవి.
చదువుట:
మనం ముందుగా గుణింతాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవాలి.
మన నకార పొల్లు హల్లులకు అచ్చులు కలిసినప్పుడు గుణింతం ఏర్పడుతుంది. నకార పొల్లు (రూపం ్) తో కూడిన హల్లుని మనం సగం మాత్రమే పలకాలి.
ఈ క్రింద "క" గుణింతం పైన పేర్కొన్న సిద్దాంతం ప్రకారం ఉదహరించబడినది. అచ్చులు హల్లులతో కలవకపోతే హల్లులను ఉచ్చరించడం అంత సులువు కాదు. కాబట్టే అక్షరమాల లోని హల్లులు 'అ' అచ్చుతో కలిసి తలకట్టును (✓)సంతరించుకుని ఉంటాయి.
"క" గుణింతం:
క్ + అ = క (తలకట్టు)
క్ + ఆ = కా (దీర్ఘం)
క్ + ఇ = కి (గుడి)
క్ + ఈ = కీ (గుడి దీర్ఘం)
క్ + ఉ = కు (కొమ్ము)
క్ + ఊ = కూ (కొమ్ము దీర్ఘం)
క్ + ఋ = కృ (వట్రసుడి)
క్ + ౠ = కౄ (వట్రసుడి దీర్ఘం)
క్ + ఎ = కె ( ఎత్వం)
క్ + ఏ = కే (ఏత్వం)
క్ + ఐ = కై (ఐత్వం)
క్ + ఒ = కొ (ఒత్వం)
క్ + ఓ = కో (ఒత్వం)
క్ + ఔ = కౌ (ఔత్వం)
క్ + అం = కం (పూర్ణానుస్వారం)
క్ + అః = కః (విసర్గం)
ఇదే గుణింత సూత్రం ఆధారంగా అన్ని హల్లుల గుణింతాలు ఏర్పడుతాయి. మనం ప్రతి గుణింతానికి ఒక ప్రత్యేకమైన పేరు ఇవ్వడం జరిగింది. ఈ పేర్లు పైన పేర్కొనడం జరిగింది. ఉదాహరణకు క్ + ఇ కి అవుతుంది. ఈ గుణింతాన్ని మనం గుడి అని పైన పేర్కొనడం జరిగింది.
ఈ ప్రాధమిక జ్ఞానంతో మనం ఉదాహరణలో పేర్కొనిన పదాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుగు భాష చాలా శాస్త్రీయమైన భాష.
కోతి
ముందుగా మనం ఇచ్చి ప్రతి అక్షరాన్ని నకారం పొల్లు హల్లుగాను మరియు దాని గుణింతానికి సంబంధించిన అచ్చు గుర్తుగా విడదీసుకుని రాసుకుందాం. ఇదే ప్రక్రియ పదం యొక్క ప్రతి అక్షరానికి వర్తింప చేద్దాం.
పై పదం లోని అక్షరాలను ఈ విధంగా రాసుకోవచ్చును.
కో → క్ + ఓ
తి → త్ + ఇ
ఇప్పుడు ఇచ్చిన పదాన్ని చదవడం సులువు కదూ.
కృషి
కృ → క్ + ఋ
షి → ష్ + ఇ
ఇప్పుడు ఈ పదం కూడా చదవడం సులువైంది కదూ!
రాయడం:
మనం ఏదైనా పదం విన్నప్పుడు, అందులో మొట్టమొదటిగా ఉన్న అక్షరాలన్నీ రాసుకోవాలి.
ఉదాహరణకు మనం "గోపాలుడు" అనే పదం రాయాలని అనుకుంటున్నాం అనుకోండి.
ఆ పదం వినగానే మనం వాటిలో అక్షరాలు అన్నీ రాసేసుకుందాం ఈ విధంగా.
గ ప ల డు
రెండవ సారి వినినప్పుడు అందులో ఏ అక్షరాలు పూర్తిగా పలుకబడుతున్నాయి, ఏ అక్షరాలు సగం పలకబడుతున్నాయో గుర్తించాలి.
గ్ ప్ ల్ డ్
ఇప్పుడు ఏ అక్షరం సగంగా అంటే నాకార పొల్లుగా పలకబడినదో, దానికి అనుబంధంగా ఏ అచ్చు వస్తుందో గుర్తించాలి. పూర్తిగా పలుకుబడిని అక్షరాలు అదే విధంగా రాసుకోవాలి.
గ్ + ఓ
ప్ + ఆ
ల్+ ఇ
డ్ + ఇ
ఇప్పుడు మనం పైన నేర్చుకున్న గుణింతపు సూత్రాలు ఆ ఆ అక్షరానికి అనువర్తించుకోవాలి.
గ్ + ఓ → గో
ప్ + ఆ → పా
ల్ + ఇ → లు
డ్ + ఇ → డు
ఈ విధంగా మనం ఏ దోషం లేకుండా తెలుగు పదాలు రాయచ్చును.
ఈ వర్గంలో ఉదాహరించిన మిగతా పదాలకు కూడా ఈ సూచించిన పద్దతిలో దోషాలు లేకుండా ఉచ్చారణ నుండి పదాలు సులువుగా రాయవచ్చును.
ఈ పద్దతితో కనుక తెలుగు పదాలు కనుక రాయగలిగితే ఇక తెలుగు టైపింగ్ చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఒక శాస్త్రీయమైన భాష.
ద్విత్వాక్షర పదాలు:
ఈ పదాల్లోని అక్షరాలలో మనకు సరళం, గుణింతం మరియు హల్లుకు అదే హల్లు వత్తుగా రావడం గమనిస్తాం.
ఉదాహరణ: అక్క, అన్నయ్య, పెద్ద మొదలగునవి.
చదవడం:
ఉదాహరణకు మనం "అన్నయ్య" అనే పదాన్ని తీసుకుందాం.
"అ"అనే అక్షరం సరళం కాబట్టి మనకు ఆ అక్షరాన్ని చదవడానికి ఎటువంటి సమస్యా లేదు.
"న్న" అనే అక్షరం దిత్వాక్షరం ఎందుకంటే న కి న నే వత్తుగా వచ్చింది.
తెలుగు లో ద్విత్వాక్షరాన్ని చదివే ప్రక్రియ:
మనం ఎప్పుడూ ద్విత్వాక్షరాన్ని పై నుంచి చదవాలి.
కనిపించే పూర్తి అక్షరాన్ని సగమే పలకాలి. అంటే అది నకారు పొల్లు అన్నమాట.
దాని వత్తుని పూర్తి అక్షరంగా చదవాలి.
ఒకవేళ కనిపించే ద్విత్వాక్షరానికి గుణింతం కనుక వుంటే, దానిని వత్తుకి అన్వయించుకోవాలి.
పైన పేర్కొన్న తెలుగు ద్విత్వక్షరాన్ని చదివే పద్ధతిని సంయుక్తాక్షరాన్ని చదవడానికి వాడవచ్చును. కనుక ఈ ప్రక్రియను బాగా అర్థం చేసుకోవాలి.
ఈ ప్రక్రియను "న్న" దిత్వాక్షరానికి ప్రయోగించిన ఎండలో ఈ అక్షరం ఈ క్రింది విధంగా విడగొట్టబడుతుంది.
న్న → న్ + నా
య్య → య్+ య
ఇప్పుడు
అన్నయ్య → అ + (న్+న) + (య్+య)
ఇప్పుడు ఒకొక్క అక్షరాన్ని సులువుగా చదివి, పూర్తి పదాన్ని ఏ దోషం లేకుండా చదవగలుగుతాము.
రాయడం:
మనం ఉదాహరణకు "తొట్టి" అనే అక్షరం దోషం లేకుండా రాయవలసి వచ్చినప్పుడు ఏమి చేయాలి. ఇదే పద్దతి ఏ దిత్వాక్షరానికైనా వాడవచ్చును.
ముందుగా పదాన్ని విని, అందులోని అక్షరాలను రాసుకోవాలి.
త ట
రెండోసారి విన్నప్పుడు, సగంగా పలికే హల్లులను నకారపు పొల్లులుగా రాసుకుని, దానికి గుణింతం వచ్చిందా లేక దానికి అదే వత్తుగా వచ్చిందా లేక ఈ రెండు అంశాలు వచ్చాయా గమనించి, అవి నకారు పొల్లు అక్షరానికి పైన చెప్పిన సూత్రాంకు అనుగుణంగా రాసుకోవాలి.
త్ + ఒ → తొ
ట్+ ట + ఇ → ట్ + (ట్ + ఇ) → ట్ + టి → ట్టి
తొట్టి.
ఈ విధంగా మన ఉచ్చారణను తెలుగు పదంగా మారుస్తాము. ఈ ప్రక్రియను బాగా అభ్యాసం చేయాలి తెలుగు పదాలు దోషాలు లేకుండా రాయాలి అనుకుంటే.
4. సంయుక్తాక్షర పదాలు
ఈ పదాల్లోని అక్షరాలలో మనకు సరళం, గుణింతం మరియు హల్లుకు వేరే హల్లు వత్తుగా రావడం గమనిస్తాం. కాబట్టి, ఈ పదాలు చదవడం మరియు రాయడం అనే ప్రక్రియలు ద్విత్వాక్షర పదాల మాదిరిగానే ఉంటాయి.
ఉదాహరణ: మూర్తి, క్రియ, కీర్తి మొదలగునవి.
చదవడం:
సూత్రం:
సంయుక్తాక్షంలో పూర్తిగా కనిపించే హల్లును సగం చదివి, దాని వత్తుని పూర్తి అక్షరంగా కలిపి చదవాలి. ఒక వేళ పూర్తిగా కనిపించే హల్లుకు కనుగ గుణింతం ఉండే, ఆ గుణింతం వృత్తుగా ఉండే హల్లుకు వర్తింప చేయాలి.
ఉదాహరణగా "మూర్తి" పదాన్ని తీసుకుందాం.
ఇందులో మొదటి అక్షరం "మూ" ను మనం గుణింతాక్షరంగా చదవవచ్చును.
రెండవ అక్షరం సంయుక్త అక్షరం.
ర్తి → ర్ + (త్ + ఈ) → ర్ + తి
ఈ విధంగా మనం
"మూర్తి" అనే పదాన్ని ఈ విధంగా విభజించుకుని చదవాలి.
మూర్తి → (మ్+ఊ)+ (ర్+తి)
ఈ విధంగా మనం కనుక కొన్ని సంయుక్త అక్షరం కలిగిన పదాలను తీసుకుని పై చెప్పిన విధంగా విశ్లేషణ చేస్తే తెలుగు పదాలు చదవడం రాయడం సులువుగా ఉంటుంది.
రాయడం:
ఈ రాయడం పద్దతి ద్విత్వాక్షర పదాలను పోలి ఉంటుంది. ఇందులో ఒక హల్లుకు వేరే హల్లు వత్తుగా వస్తుంది అంతే.
5. సంశ్లేషాక్షర పదాలు
ఈ పదాల్లోని అక్షరాలలో మనకు సరళం, గుణింతం మరియు ఒక హల్లుకు గుణింతాలు మరియు రెండు వేరు వేరు హల్లులు వత్తులుగా రావడం గమనిస్తాం. కాబట్టి వీటిని చదవటం చాలా కష్టతరం. కానీ ఈ క్రింది పద్దతితో చదవటం మరియు రాయటం కూడా సులువౌతుంది అని ఘంటాపథంగా చెప్పగలను.
ఉదాహరణ: స్త్రీ, రాష్ట్రపతి, జ్యోత్స్న మొదలగునవి.
చదవడం:
సూత్రం: సంశ్లేషాక్షరంలో
మనం ఈ అక్షరం పై నుండి చదవడం మొదలు పెట్టాలి.
పూర్తిగా కనిపించే హల్లును నకార పొల్లుతో సగం మాత్రమే ఉచ్చరించాలి.
దాని క్రింద వున్న హల్లను కూడా సగం మాత్రమే ఉచ్చరించాలి
ఈ అక్షరం చిట్టచివరి హల్లను పూర్తిగా పలకాలి, మరియు మొట్టమొదటి హల్లుకు గునుక ఏదైనా గుణింతం ఉంటే దీనికి వర్తింప చేయాలి.
ఈ విధంగా ఈ సంశ్లేషాక్షరాన్ని చదవాలి. ఇక ఈ పదంలో మిగతా అక్షరాలు వాటి వాటి రూపాన్ని బట్టి పై చెప్పబడిన రకాల్లో ఏదో ఒక పద్దతి ప్రకారం చదివి, మొత్తం పదాన్ని ఉచ్చరించాలి.
ఉదాహరణకు మనం "స్త్రీ" అనే పదం తీసుకుందాం. ఈ పదంలో ఒకే ఒక్క అక్షరం ఉంది. అది కూడా సంశ్లేషాక్షరం.
దానిని దోషం లేకుండా చదవడానికి పై సూత్రాన్ని ఉపయోగించుదాం.
స్త్రీ: స్+త్+ర్+ఈ→ స్+త్+రీ
ఇప్పుడు ఈ విశ్లేషణను ఎడమ వైపు నుంచి కుడి వైపుకు చదివిన, మనకు సంశ్లేషాక్షర ఉచ్చారణ దోషం లేకుండా వస్తుంది. అంతే! ఎంతో సులువుగా ఉంది కదూ!
ఇంకో ఉదాహరణ:
ఉదాహరణకు, "రాష్ట్రపతి" పదాన్ని తీసుకుందాం. ఇందులో ష్ట్ర అక్షరం సంశ్లేషాక్షరం. దీని విశ్లేషణ ఈ క్రింద ఇవ్వబడింది. ఈ పదంలోని మిగతా అక్షరాలు సరళంగాను మరియు గుణింతాక్షరాలు మాదిరిగా ఉన్నాయి. వాటిని చదవడానికి పై భాగాల్లో చెప్పిన సూత్రాలు ఉపయోగించాలి.
ష్ట్ర: ష్+ట్+ర
ఈ విధంగా మనం ఎంత క్లిష్టమైన తెలుగు పదాలను పైన చెప్పిన పద్దతుల్లో సులువుగా చదవవచ్చును మరియు రాయవచ్చును.
ఈ పద్దతి కనుక బాగా అభ్యసిస్తే, మొబైల్ లో మరియు కంప్యూటర్ లో తెలుగు టైపింగ్ సులభతరం కాగలదు.
Comments
Post a Comment